14 May, 2015

ఓ మనస్వినీ!
నిన్నటి పగలు ఆవిరైన సముద్రం
నేటిరేయి వర్షమై కురిసె.
గత వసంతంలో రాలిన కుసుమాలు
నేటి వసంతంలో వికసించె.

అయితే..
అయిదువేల ఉదయాలకు మునుపు
అస్తమించిన మాఇంటిసూర్యుడు
ఇంకెన్నడు ఉదయిస్తాడు?  
క్షణం క్షణం ఉదయించే ఈ వేలవేల సూర్యుల్లలో  
ఏ సూర్యుడు మాసూర్యుడు?                      
  

01 August, 2014

వేసవి..నడినిశి..
ఉరుములు..
మెరుపులు..
మట్టిపూల సువాసనకు మైమరిచి
గతం మరింత గట్టిగా కురుస్తోంది.

10 September, 2013


సమసిపోవు
కొన్ని కలలు
సంధ్యపొద్దులోనే.

నిలిచిపోవు
కొన్నికలలు
నడినిశిలోనే.  

వాడిపోవు
కొన్నికలలు
వేకువలోనే.  

కనులలో ప్రవహించే కలలు
కడలిలో పయనించే అలలు
మన బ్రతుకులు.
కొన్ని తీరాన్ని చేరతాయి
మరికొన్ని మధ్యలోనే
మరణచరణాల్ని అలపిస్తాయి.            

02 August, 2013

నేటి రాజకీయం

అక్షరం వచ్చినోల్లు అమెరికాకి
అక్షరం నేర్చనోల్లు అసెంబ్లీకి
వర్తమానం బంధుల్లోకి
భవిష్యత్తు భూడిదలోకి.           
-------------------------
నోటిస్తే ఓటేశాడు
మద్యంపోస్తే జైకొట్టాడు 
సామాన్యుడు మూర్ఖుడు
లాలంతో సంతృప్తిపడి
గుర్రాన్ని వదిలేశాడు.     
-----------------------------
మాతెలంగాణాతల్లికి 
మల్లెపూదండ
మాతెలుగుతల్లికి 
కన్నీటిహారతులు.
ఆకలితో ప్రజలు అలమటిస్తుంటేను.              
రహదారుల్లో జనం రాల్లువిసురుతుంటేను.           
------------------------------------------------
భూములని తిన్నారు
గనులని తిన్నారు
గడ్డిని తిన్నారు
ఇసుకనూ తిన్నారు
అయినా..
పిచ్చిజనం
దేశద్రోహులను 
పల్లకిలో ఊరేగించారు.          
--------------------------
అవినీతి పురుగు
ఆకులను తొలిచింది
కొమ్మలను తొలిచింది
కాండాన్ని తొలిచింది.
ఇక తల్లివేరుని తొలిచేది కాయం 
వృక్షం కూలేది కాయం.      
-----------------------------
తప్పు నాయకులది కాదు ప్రజలది.  
రాజకీయసేద్యంలో
కలుపుమొక్కలని పెంచారు
పండేమొక్కలని పెరికేశారు
ప్రతి అయిదు సంవత్సరాలకి  
పండే.. ఒకటే పంట 
కడుపు మంట    
ఆకలి అంటే ఎలా?        


11 July, 2013

చిన్నోడా...
వరినాటడానికి
మేం మడికాడికెల్తాండం.  
సద్దెన్నెంతీసకరారా!  
   
లేదయ్యా..
నేచదువుకోవాల.  

చిన్నోడా..
నాకు విపరీతమైన మోకాల్లనొప్పులు.
కనికెల్లదాకావెల్లి
మడికి మడవపెట్రానాయనా!    
 
లేదయ్యా!
నేరాసుకొవాల!

చిన్నోడా...
వరికోతకొచ్చింది
బడిచాలీరా నాల్గురోజులు
నీకుపుణ్యముంటది.
 
లేదయ్యా..
మాకిపుడు పరీచ్చలు పెడ్తాండ్రు.

ఛిన్నోడా..
దేశంకాని దేశం
ఎపుడొస్తావో ఏమోరా!  

లేదయ్యా!
ఏడాదికల్లా తిరిగొస్తాను!

ఎడాది దాటింది
స్వదేశానికొచ్చాను.
రచ్చబండమద్య నిటారుగా నిలబడి  
ఊరికి హుషారుగా
కాపలాకాసే...
ఆ చింతచెట్టు మౌనంగా
చింతిస్తున్నట్లుంది.
అర్థమయ్యింది  
"చిన్నోడా..! చిన్నోడొచ్చాడా..!
అని మనషుల్ని, చెట్లని, పుట్లని అడిగే  
అయ్యమాత్రం ఇకలేడని".

నా రోదనల రోదసిలో
మరోవిషాదవిశ్వవిస్పొటనం.            
 

21 May, 2013


పండంటి పసివాడు
బోసినవ్వులు నవ్వాడు
ఇల్లు పూదోటై వికసించింది. 
పండుముసలివాడు
బోసినవ్వులు నవ్వాడు
మౌనం పాషాణమై
వాడిమనసును హరించింది.      

పండంటి పసివాడు ఏడ్చాడు
పరివారం వాడిపాదాల నిలిచి  బుజ్జగించింది.
పండుముసలివాడుఏడ్చాడు
పట్టించుక్కున్నవారేలే రు.  

పండంటి పసివాడు
అన్నమడిగాడు
వెన్నెలచూపిస్తూ అమ్మ అన్నం తినిపించింది. 
పండుముసలివాడు
ఆకలన్నాడు 
కనినవారులేరు.. వినినవారులేరు. 
అంతే... 
పందిటకు వేలాడింది  
పండువెన్నెల్లో ఒక ప్రాణం.  

తీరాన నిలబడి
అలలను చూస్తూ..
కడలిని మరిచిపొయారు మూర్ఖులు.

16 March, 2013


మాఘమాసం..
మహాశివరాత్రి...
పితృదేవతారాధన..
కన్నీరుకురిసిన రాత్రి.

నాడు
చింతచెట్టుకింద
రచ్చబండపై కూర్చుని
నిరంతరం నా రాకకై
చింతించిన మనిషి,
పదిమంది నన్ను పొగడగనే
పుత్రోత్సాహంతో పొంగిపోయిన మనిషి,
నేడు వూరికి దూరంగా
చితిలొ నివాసముంటున్నాడు.
సూర్యోదయం నుంచి 
సూర్యాస్తమయం వరకు
ఎంతబ్రతిమాలినా…
నా భాగోగులు వినడు 
తన భాగోగులు చెప్పడు.

నా పాదాలు కందిపోతాయేమోనని
తన భుజాలన ఎక్కించుకుని
బడిదాక మోసుకెల్లిన మనిషి,
అన్నం తీసుకెల్లననిజెప్పి
అలిగి నేను బడికెల్తే..
బడిదాక నడిచివచ్చి
నన్ను బ్రతిమాలే మనిషి,   
వెన్నెల్లో హలాన్నిబట్టి
పొలందున్నిన మనిషి,
మట్టిని మత్రించి 
మానిక్యాలుగా మార్చిన మనిషి
నేడు వూరికి దూరంగా
చితిలొ నివాసముంటున్నాడు.
సూర్యోదయం నుంచి 
సూర్యాస్తమయం వరకు
ఎంతబ్రతిమాలినా
నా భాగోగులు వినడు 
తన భాగోగులు చెప్పడు.

శివుడా!
అద్యంతంలేని ఈవిశ్వంలో
ఆదిఎందుకు?
అంతమెందుకు?
అంతులేని దుఃఖమెందుకు? 
  

26 January, 2013

ఎవరో ఈ విశ్వశిల్పాన్ని మలిచి
ఏ విశ్వంపైనో.. ప్రతిష్టించారు.
మహాశిల్పులకు సైతం
మతిపోవునట్లు.
యుగాల అగాధాలు ప్రవహించినా
శిల్పం శిథిలమవ్వలేదు.
ఎంత చింతించినా.. ఎంత శోధించినా
శిల్పిజాడ తెలియలేదు.          
 
ఎవరో మధురాతి మధురంగా
ఆది, అంతం లేకుండా
జీవనగానాన్ని ఆలపిస్తున్నారు.
అమావాస్యరాత్రి సైతం
కలువలు వికసించెటట్లు.
యుగాల సవ్వడులు అడ్డుపడినా
గానం ఆగలేదు
ఎంత చింతించినా.. ఎంత శోధించినా
గాయకుని అడుగులు కనపడలేదు.

ఎవరో ఈ విశ్వవృక్షం క్రింద కూర్చుని
విశ్వాన్ని శ్వాసిస్తున్నారు,
శాసిస్తున్నారు.
ఎంత చింతించినా.. ఎంత శోధించినా
ఆ రూపం కనపడలేదు
ఆ శ్వాస వినపడలేదు.       

27 December, 2012

మరణించే వారెవరో
జన్మించే వారెవరో
ఎవ్వరికీ తెలియదు
ఎప్పటికీ తెలియదు
ఎందుకంటే...
సృష్టిని రచించినవాడు
లిపిని నేర్పకుండానే మరణించాడు. 

21 November, 2012

సమస్త ప్రాణనదులు
ప్రవహించె ఈమరణసముద్రంలోనికి ,

అంతటితో ఆగక
సముద్రంలో ఓ సుడిగుండం లేచి
ఆత్మలు రూపం తొడిగి
ప్రాణాన్ని ప్రతిష్టించె.
   
ఎవరి నాన్నో
నేడు ఎవరికో అన్న
ఎవరి తల్లో
నేడు ఎవరికో చెల్లి. 

నదుల ప్రవాహం ఆగదు
సముద్రం ఎన్నటికీ నిండదు.